: మూగజీవిపై ఎమ్మెల్యే ప్రతాపం, పోలీసు గుర్రాన్ని చితకబాదిన వైనం
పోలీసులు తమ ఆందోళనను అడ్డుకున్నారన్నఅక్కసుతో డెహ్రాడూన్ కు చెందిన ఒక ఎమ్మెల్యే విచక్షణా రహితంగా ప్రవర్తించాడు. పోలీసు లాఠీతో పోలీసు గుర్రాన్ని చితకబాదాడు. దీంతో గుర్రం కాలు దెబ్బతింది. ఈ సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో ఈరోజు జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను అడ్డుకున్న పోలీసులు బీజేపీ నాయకులను, కార్యకర్తలను చెదరగొట్టారు. దీంతో, ఆగ్రహించిన సదరు ఎమ్మెల్యే తన ప్రతాపాన్ని పోలీసు గుర్రంపై చూపించారు. తీవ్రంగా గాయపడ్డ గుర్రాన్ని అక్కడి మిలటరీ అకాడమీలోని పశువైద్య శాలకు తరలించారు. గుర్రం కాలు బాగా దెబ్బతిందని, ఆ కాలుని తొలగించాలని పరీక్షించిన వైద్యులు చెప్పారు. కాగా, విచక్షణారహితంగా ప్రవర్తించి గుర్రాన్ని గాయపర్చిన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.