: డబ్బు తరలించుకుపోయిన మాల్యా... ఈడీ వద్ద ఆధారాలు!
అరెస్టుకు భయపడి ఇండియా నుంచి పారిపోయిన యూబీ గ్రూప్ మాజీ చీఫ్ విజయ్ మాల్యా, వెళ్తూ వెళ్తూ తన వెంట భారీగా డబ్బును విదేశాలకు తరలించినట్టు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు తమకు ఆధారాలు లభించినట్టు పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఈడీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, మార్చి 2న మాల్యా భారీ బ్యాగులను వెంటేసుకుని ఆయన విమానం ఎక్కినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆయన లండన్ కు వెళ్లిపోయినట్టు సుప్రీంకోర్టుకు సీబీఐ స్వయంగా వెల్లడించింది కూడా. హవాలా మార్గం ద్వారా ఆయన డబ్బు తరలించారా? అన్నది తెలియాల్సి వుంది. ఇదిలావుండగా, రెండు రోజుల్లోగా కింగ్ ఫిషర్ కు బ్యాంకులు ఇచ్చిన రుణాలకు సంబంధించిన దస్తావేజులన్నీ తమకు ఇవ్వాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఐడీబీఐ సహా 17 బ్యాంకులను సోమవారం నాడు నోటీసులు పంపింది.