: మేమిద్దరం... వారొక్కరు!: అవిశ్వాసంపై చర్చలో యనమల మెలిక!
ఏపీ అసెంబ్లీలో చంద్రబాబునాయుడు సర్కారుపై విపక్ష వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సభలో ఆసక్తికర చర్చకు తెర లేచింది. చర్చ ప్రారంభం కాగానే... తీర్మానంపై సంతకాలు పెట్టిన సభ్యులకే చర్చలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని సభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కొత్త అంశాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత మాట్లాడిన వైసీఎల్పీ ఉపనేత జ్యోతుల నెహ్రూ, బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు అభ్యర్థనతో సంతకాలు పెట్టిన సభ్యులకే కాకుండా మిగిలిన సభ్యులకూ చర్చలో అవకాశం కల్పించేందుకు అధికారపక్షం సుముఖత వ్యక్తం చేసింది. అయితే విపక్షానికి చెందిన ఒక సభ్యుడు మాట్లాడితే... తమ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని యనమల కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన పదే పదే వల్లె వేశారు. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి.