: అవిశ్వాసంపై చర్చకు 7 గంటల సమయం సరిపోదట!... రోజంతా కేటాయించాలంటున్న వైసీపీ
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సర్కారుపై విపక్ష వైసీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు 7 గంటల సమయం కూడా సరిపోదట. విపక్షం ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని అనుమతిస్తూ స్పీకర్ కోడెల శివప్రసాద్ కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకున్నారు. దీనిపై చర్చను ఎఫ్పుడు, ఎంతసేపు నిర్వహించాలన్న అంశంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఆయన సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ)కి కట్టబెట్టారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం భేటీ అయిన బీఏసీ... అవిశ్వాసంపై ఈ రోజు, 7 గంటల పాటు చర్చను నిర్వహించాలని తీర్మానించింది. దీనిపై వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అవిశ్వాస తీర్మానంపై చర్చకు 7 గంటల సమయం సరిపోదని వాదించామని ఆ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన టీడీపీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించామని ఆయన చెప్పారు. దీనిపై ఓ రోజంతా చర్చకు అనుమతించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. రోజంతా చర్చిద్దామన్న తమ వాదనను బీఏసీలో అధికార పక్షం అంగీకరించలేదని కూడా గడికోట ఆరోపించారు. అయినా తాము తీర్మానంపై చర్చకు సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.