: వైసీపీ అవిశ్వాస తీర్మానానికి గ్రీన్ సిగ్నల్... ఓటింగ్ పై సమయాన్ని నిర్ణయించనున్న బీఏసీ
ఏపీ అసెంబ్లీలో మరో కీలక ఘట్టానికి తెర లేచింది. చంద్రబాబునాయుడు సర్కారుపై విపక్ష వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ కు స్పీకర్ కోడెల శివప్రసాద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే తీర్మానంపై చర్చ, ఓటింగ్ కు... తేదీ, సమయాన్ని నిర్ణయించే బాధ్యతను ఆయన సభా వ్యవహారాల కమిటీకి అప్పగించారు. ఈ మేరకు సభలో కొద్దిసేపటి క్రితం స్పీకర్ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రజల అభీష్టం మేరకు పాలన సాగించడంలో టీడీపీ సర్కారు విఫలమైందని ఆరోపిస్తూ 15 మంది ఎమ్మెల్యేల సంతకాలతో వైసీపీ అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్మానాన్ని నేటి ఉదయం ప్రారంభమైన సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల తర్వాత స్పీకర్ అనుమతితో వైసీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ప్రతిపాదించారు. ఆ తర్వాత సభను 10 నిమిషాల పాటు స్పీకర్ వాయిదా వేశారు.