: ఆర్, జులియా, హదూప్... తెలుసా? ఇవి తెలిసిన టెక్కీలకు రెట్టింపు వేతనం!
మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యక్తిలోని సాంకేతిక నైపుణ్యాన్నీ పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా శరవేగంగా మారిపోయే టెక్నాలజీ విభాగంలో అత్యుత్తమ నైపుణ్యం, కాలానుగుణ మార్పులను సులువుగా వంటబట్టించుకునే శక్తి ఉంటే వారికి మరింత మంచి వేతనాలు ఇచ్చేందుకు టెక్ సంస్థలు సంకోచించడం లేదు. ఆర్, జులియా, హదూప్, స్క్రమ్ మాస్టర్, డెవ్ ఓప్స్... ఈ పదాలను విన్నారా? చాలా మందికి వీటి గురించి తెలియదు. కానీ టెక్ ప్రపంచంలో ఇవే ఇప్పుడు ట్రెండ్. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలను కోరుకుంటున్న వారు వీటి చుట్టూనే తిరుగుతున్నారు. ఆర్... స్టాటిస్టికల్ కంప్యూటింగ్ విభాగంలో ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డేటాను విశ్లేషిస్తుంది. ఇది తెలిస్తే సాలీనా రూ. 8 లక్షల వరకూ వేతనం లభిస్తుంది. రెగ్యులర్ గా ఫ్రెషర్ అయితే ఓ ఐటీ సంస్థ సంవత్సరానికి రూ. 3.5 లక్షల వేతనాన్ని అందిస్తుంది. అదే 'ఆర్' కూడా తెలిస్తే... రెట్టింపుకు పైగానే పొందవచ్చు. అలాంటిదే హదూప్... ఇది మొబైల్ యాప్ డెవలపర్. హదూప్ తెలిసుండటంతో పాటు దాన్ని బాగా వాడగలిగే వారికి ఐటీ కంపెనీలు రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. మొబైల్ వాడకం, క్లౌడ్ కంప్యూటింగ్ పెరుగుతున్న వేళ ఐటీ ఉద్యోగాలు మరింత ఆకర్షణీయమవుతున్నాయి. ఐదేళ్ల క్రితం వరకూ ఐటీ సెక్టారులో జావా, సీ ప్లస్ ప్లస్ వంటి కోర్సులే రాజ్యమేలగా, వాటి స్థానంలో కొత్త కోర్సులు వచ్చాయని, వాటిని నేర్చుకున్న వారికి మిగతా ఉద్యోగులతో పోలిస్తే, రెట్టింపు వరకూ వేతనాలు అందుతున్నాయని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సింప్లీలెర్న్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ కశ్యప్ దలాల్ తెలిపారు. ఇక దలాల్ స్ట్రీట్ సైతం కొత్త సాంకేతికత వైపు పరుగులు పెడుతోంది. ఆర్, జులియా, హదూప్ లలో నైపుణ్యం ఉన్న వారికి జావా నిపుణులతో పోలిస్తే 25 శాతం అదనపు వేతనాలు అందుతున్నాయి. ఇక ఇదే రంగంలో 2 నుంచి నాలుగేళ్ల అనుభవముంటే, రూ. 12.5 లక్షల నుంచి రూ. 25 లక్షల వేతనం పలకరిస్తోంది. పూర్తి స్థాయి డెవలపర్లకు ఇండియాలో ఎంతో డిమాండ్ ఉందని ఆన్ లైన్ ప్రోగ్రామింగ్ ప్లాట్ ఫాం హాకర్ ఎర్త్ సహ వ్యవస్థాపకుడు సచిన్ గుప్తా వ్యాఖ్యానించారు. డిమాండుకు తగ్గట్టు నిపుణులు లభించడం లేదని అన్నారు. త్వరగా ఈ రంగంలోని కొత్త టెక్నాలజీలో నైపుణ్యాన్ని పొందగలిగితే, ఉజ్వల భవిష్యత్ ఉంటుందని సలహా ఇచ్చారు.