: పట్టపగలు దారుణం... తక్కువ కులం వ్యక్తిని పెళ్లిచేసుకుందని నడిరోడ్డుపై దంపతులను కొట్టి చంపిన దుండగులు!
తమిళనాడులోని తిరువూరులో పట్టపగలు ఘోర దారుణం జరిగింది. ఓ యువతి తక్కువ కులం యువకుడిని వివాహం చేసుకోగా, అది ఇష్టంలేని వారు, నడిరోడ్డుపై ఆ దంపతులను దారుణంగా హత్య చేశారు. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ లో నిక్షిప్తమయ్యాయి. ఘటనపై మరిన్ని వివరాల్లోకి వెళితే, రాజకీయంగా మంచి పలుకుబడి వున్న తేవర్ కులానికి చెందిన కౌసల్య (19) అనే యువతి, ఇంజనీరింగ్ చదువుతున్న శంకర్ (23)ను ఎనిమిది నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ వివాహం కౌసల్య కుటుంబానికి ఇష్టం లేదు. వీరిద్దరూ తిరువూరు మార్కెట్ సమీపంలో నడిచి వెళుతుండగా, బైకుపై వచ్చిన ముగ్గురు ఆగంతుకులు వారిని అడ్డగించారు. ఆ వెంటనే శంకర్ పై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. చుట్టుపక్కలున్నవారు షాక్ తో చూస్తుండగానే, ఇష్టానుసారం కొడుతూ, కత్తులతో పొడిచారు. శంకర్ కిందపడిపోయి, శరీరంలో కదలికలు ఆగిపోగానే, కౌసల్యపై దాడి చేశారు. ఈ ఘటనలో శంకర్ అక్కడికక్కడే చనిపోగా, కౌసల్య తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దుండగులను అరెస్ట్ చేసేందుకు ఐదు టీములను ఏర్పాటు చేశారు. కాగా, గడచిన ఐదేళ్లలో తమిళనాడులో జరిగిన మూడవ పరువు హత్య ఇది.