: రాహుల్ గాంధీకి మరో షాక్!... పౌరసత్వంపై వివరణ ఇవ్వాలని ఎథిక్స్ కమిటీ తాఖీదు
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ తో పాటు ఆయన తల్లి, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కోర్టు మెట్లెక్కించిన బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామే తాజా షాక్ కు కారణమయ్యారు. బ్రిటన్ లో ఓ కంపెనీని ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ, సదరు కంపెనీ వార్షిక నివేదికలో తాను బ్రిటిష్ పౌరుడినేనని పేర్కొన్నారని స్వామి గతంలో ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రేగిన వివాదం అనతికాలంలోనే సద్దుమణిగిపోగా, సుబ్రహ్మణ్యస్వామి మాత్రం దానిని వదలలేదు. రాహుల్ పౌరసత్వాన్ని ప్రశ్నిస్తూ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు తూర్పు ఢిల్లీ పార్లమెంటు సభ్యుడు రమేశ్ గిరి ఫిర్యాదు చేశారు. ఈ లేఖను పరిశీలించిన స్పీకర్ దానిని పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి పంపించారు. దీంతో రంగంలోకి దిగిన ఎథిక్స్ కమిటీ రాహుల్ గాంధీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. పౌరసత్వంపై వస్తున్న విమర్శలపై సమాధానమివ్వాలని ఆ లేఖలో కమిటీ రాహుల్ కు ఆదేశాలు జారీ చేసింది. నోటీసుల జారీని ధ్రువీకరించిన ఎథిక్స్ కమిటీ సభ్యుడు అర్జున్ రామ్ మేఘవాల్... ఈ విషయం చాలా కీలకమైనదేనన్నారు. రాహుల్ గాంధీ వివరణ ఇచ్చాక దీనిపై తదుపరి చర్యల అంశాన్ని పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు.