: మరో 6 దేశాల్లో అమరావతి ఆఫీసులు!
రాష్ట్రంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే పనిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా వున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పలు దేశాలకు టూర్లు వేసి ఆయా పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న దేశాల్లో ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేస్తే మరింత సౌకర్యవంతంగా ఉంటుందన్న ఆలోచనలో భాగంగా నిన్న బ్రిటన్ రాజధాని లండన్ లో ‘అమరావతి ఆఫీస్’ను ప్రారంభించడం జరిగింది. త్వరలోనే మరో ఆరు దేశాల్లో ఈ తరహా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని ఏపీ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఏపీఏడీబీ) సీఈఓ జాస్తి కృష్ణకిశోర్ చెప్పారు. నిన్న లండన్ లో అమరావతి కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా అమరావతి కార్యాలయాలు ఏర్పాటు కానున్న నగరాలను ప్రకటించారు. వీటిలో సింగపూర్, జపాన్ రాజధాని టోక్యో, హాంకాంగ్ లేదా షాంగై, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్, దుబాయి, అమెరికాలోని లాస్ ఏంజెలిస్ నగరాలున్నాయి.