: కలల్లో రోజా!... మూడు నెలల్లో వైసీపీ ఖాళీ!: జోస్యం చెప్పిన ఆనం


మొన్నటిదాకా కాంగ్రెస్ నేతగా కొనసాగి ఇటీవలే ‘హస్తం’ పార్టీకి ‘చేయి’చ్చి టీడీపీ నేతగా మారిన మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి నెల్లూరులో భవిష్యవాణి వినిపించారు. మరో మూడు నెలల్లో ఏపీలో విపక్ష పార్టీ వైసీపీ ఖాళీ కానుందని ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. నిన్న నెల్లూరులోని తన కార్యాలయానికి మీడియాను పిలిపించుకున్న ఆనం... తనదైన స్టైల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆనం... వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను తన చెల్లిగా అభివర్ణించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వస్తుందని, అప్పటి నుంచి 30 ఏళ్ల పాటు రాష్ట్రానికి జగన్ సీఎంగా కొనసాగుతారని రోజా కలలు కంటున్నారని ఆనం పేర్కొన్నారు. అయితే అందుకు భిన్నంగా మరో మూడు నెలల పాటు ఆ పార్టీ ఉంటేనే గొప్ప అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. విపక్ష నేతగా జగన్ పనికి రాడన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన కనీసం పార్టీ జెండా కూడా ఎగరవేయని జగన్, వ్యాపారాల కోసం ఎక్కడికో వెళ్లిపోయాడని ఆనం ఆరోపించారు.

  • Loading...

More Telugu News