: కన్నయ్యకు మత్తయ్య మద్దతు!... ఢిల్లీ వెళ్లి భుజం తట్టిన ‘ఓటుకు నోటు’ నిందితుడు
ఒకరేమో ఉగ్రవాదికి ఉరిని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించి రాజద్రోహం కింద కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి. మరొకరేమో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చు రగిల్చిన ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడిగా తెలంగాణ ఏసీబీ కేసులు నమోదు చేసిన వ్యక్తి. ఇద్దరూ కలిశారు. మొదటి వ్యక్తి భుజం తట్టేందుకు రెండో వ్యక్తి ఏకంగా హైదరాబాదు నుంచి ఢిల్లీకి వెళ్లారు. వారే ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్ యూ) స్టూడెంట్ లీడర్ కన్నయ్య కుమార్, అఖిల భారత దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య జాతీయ కార్యదర్శి జెరూసలెం మత్తయ్య. హైదరాబాదు నుంచి నిన్న ఢిల్లీ వెళ్లిన మత్తయ్య... అక్కడ జేఎన్ యూకు వెళ్లి కన్నయ్యకు మద్దతు పలికారు. తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో పర్యటించాలని కన్నయ్యకు మత్తయ్య ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కన్నయ్యపై మత్తయ్య ప్రశంసల జల్లు కురిపించారు. కన్నయ్య దేశ భక్తుడని, మతతత్వవాదుల కుట్రలను భగ్నం చేసి జాతీయవాదిగా నిరూపించుకున్నారని కొనియాడారు.