: ఈసారి పూర్తి అవగాహనతో బడ్జెట్ రూపొందించాం!: తెలంగాణ మంత్రి ఈటల
ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పూర్తి అవగాహనతో ఉంటుందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రేపు తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం 2016-17 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. సమూలమైన మార్పులతో కూడిన బడ్జెట్ ను ఈసారి ప్రవేశపెడుతున్నామన్నారు. 2014-15 బడ్జెట్ అస్పష్టంగా ఉందని, 2015-16 బడ్జెట్ మిణుకుమిణుకు మందని, 2016-17 బడ్జెట్ ను మాత్రం ఇప్పటి అవసరాలకు అనుగుణంగా రూపొందించడం జరిగిందని అన్నారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఈ బడ్జెట్ ను రూపొందించామన్నారు. గత బడ్జెట్టులతో పోలిస్తే ఇప్పటిది 'ప్లాన్ బడ్జెట్' అవుతుందని చెప్పారు. పెట్టిన ప్రతి పైసాకు అర్థం ఉండాలి, అది ఉపయోగపడాలి అని అన్నారు. అప్పుచేసి పప్పుకూడు తినడం తప్పు కానీ, ఆ అప్పుతో రాష్ట్రాన్ని బాగు చేసుకుంటే తప్పేమిటని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. కొన్ని రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించినా, మిగిలిన రంగాలకు నిధులు తగ్గకుండా చూస్తామన్నారు. ఇంటింటికీ నల్లా ఇచ్చే మిషన్ భగీరథ, ఇరిగేషన్, పేదలకు డబుల్ బెడ్ రూమ్ పథకాలకు ఈ బడ్జెట్ లో ఎక్కువ ప్రాధాన్యమిస్తామన్నారు. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మారుస్తామన్న విపక్షాల విమర్శలను ఆయన కొట్టిపారేశారు. కాగా, వరుసగా మూడోసారి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ను ఈటల రాజేందర్ రేపు ప్రవేశపెట్టనున్నారు.