: రాలుతున్న నక్షత్రంలా మైక్రోమ్యాక్స్!


సరిగ్గా ఏడాది క్రితం ఇండియాలో అత్యధికంగా స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తున్న సంస్థగా శాంసంగ్ ను కిందకు నెట్టేసిన దేశవాళీ దిగ్గజం మైక్రోమ్యాక్స్, ఇప్పుడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ రాలుతున్న నక్షత్రంలా కనిపిస్తోంది. సంస్థ మార్కెట్ వాటా కుప్పకూలడం, ప్రధాన ఉద్యోగులంతా రాజీనామాల బాట పట్టడం, పలు చైనా కంపెనీలు అధిక ఫీచర్లతో కూడిన ఫోన్లను విడుదల చేసి పోటీని తీవ్రం చేయగా, మార్జిన్లు కుదేలవడం తదితర కారణాలతో మైక్రోమ్యాక్స్ కుదేలైంది. ప్రపంచంలోనే శరవేగంగా ఎదుగుతున్న స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా గత సంవత్సరం 29 శాతం అమ్మకాల వృద్ధితో 10.3 కోట్లకుపైగా ఫోన్ విక్రయాలు నమోదు కాగా, అందులో దాదాపు 20 శాతం వాటా మైక్రోమ్యాక్స్ దే. ఇక ఆపై పరిస్థితి మారింది. సంస్థ అందిస్తున్న స్మార్ట్ ఫోన్ల కన్నా మెరుగైన ఫీచర్లతో, తక్కువ ధరకు ఫోన్లు వచ్చేశాయి. చైనా కేంద్రంగా భారత్ లోని సంస్థలకు విడిభాగాలను విక్రయిస్తున్న ఎన్నో కంపెనీలు ఇక్కడి మార్కెట్లో అవకాశాలను వెతుక్కుంటూ వచ్చేశాయి. "చైనా బ్రాండ్ల రాకతో, ఎన్నో భారత కంపెనీలు నష్టపోతున్నాయి. మరో సంవత్సరం తరువాత మైక్రోమ్యాక్స్ వంటి భారత స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు మరింత పోటీని తట్టుకుని నిలబడాల్సి వుంటుంది" అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అనలిస్ట్ తరుణ్ పాఠక్ అభిప్రాయపడ్డారు. 2000 సంవత్సరంలో నలుగురు ఔత్సాహికుల స్టార్టప్ గా ప్రారంభమైన మైక్రోమ్యాక్స్ అనతి కాలంలోనే ఎదిగింది. 2008 నుంచి స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తున్న సంస్థ చైనా కంపెనీలైన కూల్ పాడ్, జియోనీ, ఒప్పో వంటి వాటితో డీల్స్ కుదుర్చుకుని శరవేగంగా ఆకాశానికి ఎదిగింది. ఆపై అవే సంస్థలు ఇండియాలో కాలు మోపి దాదాపు 40కి పైగా కొత్త ఫోన్లను పరిచయం చేయడంతో మైక్రోమ్యాక్స్ నష్టపోయింది. 2014లో శాంసంగ్ విక్రయాలను అధిగమించిన వేళ, మరింతగా బలోపేతం కావాలన్న సంస్థ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలు కూడా నష్టానికి కారణమని తెలుస్తోంది. కొత్తగా టాప్ ఎగ్జిక్యూటివ్ లను విధుల్లోకి తీసుకోవాలన్న నిర్ణయంపై వ్యవస్థాపకుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఆపై చైనా సంస్థ అలీబాబా వచ్చి, 20 శాతం వాటాను 1.2 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 7,400 కోట్లు) కొనుగోలు చేసింది. ఆ సంస్థకు మైక్రోమ్యాక్స్ లో జరుగుతున్న అంతర్గత యుద్ధం, వృద్ధిపై అంచనాలు లేకపోయాయని నిపుణులు వ్యాఖ్యానించారు. భవిష్యత్ మార్కెట్ పై సంస్థ సహ వ్యవస్థాపకుడు వికాస్ జైన్ నేతృత్వంలో తయారైన రోడ్ మ్యాప్ ను సైతం అలీబాబా నిరాకరించినట్టు తెలుస్తోంది. ఇప్పుడిక కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలోనూ సంస్థ విఫలమైంది. సాఫ్ట్ వేర్ డిజైన్ కోసం అత్యధిక వేతనాలు ఇచ్చి 80 మందిని నియమించుకుని వారితో బెంగళూరులో పనిచేయించుకున్నా సరైన ఫలితాలు రాలేదని సమాచారం. కాగా, చైనా కంపెనీల రాకతో తమతో పాటు ఇండస్ట్రీ మొత్తం ఇబ్బందులు పడుతోందని, వీటి నుంచి గట్టెక్కేందుకు కృషి చేస్తున్నామని మైక్రోమ్యాక్స్ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కాగా, రెండేళ్ల క్రితం 48 శాతంగా ఉన్న లావా, కార్బన్, మైక్రోమ్యాక్స్ వంటి సంస్థల మార్కెట్ వాటా, గతేడాది 43 శాతానికి పడిపోగా, చైనా కంపెనీల ఫోన్ల వాటా దాదాపు రెట్టింపయి 18 శాతానికి చేరింది.

  • Loading...

More Telugu News