: మేము రాసిందే గవర్నర్ చదువుతారు, మరే అధికారమూ లేదు... అదే ఫైనల్: కేసీఆర్
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగాన్ని ప్రభుత్వమే తయారు చేసి ఇస్తుందని, కేబినెట్ ఆమోదించిన ప్రసంగాన్ని మాత్రమే ఆయన చదువుతారని, దాన్ని మార్చే అధికారం ఆయనకు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం చెప్పేదే ఫైనలన్న సంగతి, విపక్షంలో నేడున్న ఒకనాటి అధికార పక్ష సభ్యులందరికీ తెలిసి కూడా విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కేసీఆర్ సమాధానం ఇచ్చారు. అభివృద్ధిపై తాము రెండేళ్లుగా ఎంతో కృషి చేస్తున్నామని, 50 ఏళ్లుగా కొనసాగుతూ వచ్చిన దరిద్రం అంత త్వరగా పోదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని, విపక్షాల నుంచి ఒక్కటంటే ఒక్క నిర్మాణాత్మక సలహా కూడా రాలేదని విమర్శించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో తండాలనన్నింటినీ గ్రామ పంచాయతీలుగా మార్చనున్నామని వివరించారు. కాంగ్రెస్ హయాంలో పారిశ్రామికవేత్తలు కరెంట్ కోసం ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేశారని, తాము వారికి 24 గంటలూ విద్యుత్ ను అందిస్తున్నామని గుర్తు చేశారు. ఆపరేషన్ భగీరథ అంటే జీవన్ రెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని విమర్శించారు.