: ఇప్పట్లో ఇండియాకు వచ్చేది లేదు: తెగేసి చెప్పిన విజయ్ మాల్యా
తనపై ఇప్పటికే ఓ నేరగాడన్న ముద్ర భారత్ లో పడిందని, అందువల్ల తాను తిరిగి భారత్ కు వెళ్లేందుకు ఇది సరైన సమయం కాదని భావిస్తున్నానని దేశాన్ని విడిచి పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా తెగేసి చెప్పాడు. ప్రస్తుతం లండన్ లో ఉన్న మాల్యా 'సండే గార్డియన్'కు ఇంటర్వ్యూ ఇచ్చారు. "నాపై గత సంవత్సరం లుకౌట్ నోటీసు జారీ అయింది. నేనేమీ పారిపోలేదు. ఇప్పుడు నన్నో క్రిమినల్ గా ఎందుకు చిత్రిస్తున్నారు? రుణాలు తీర్చలేకపోవడం వ్యాపారంలో భాగం. బ్యాంకులు రుణాలు ఇచ్చినప్పుడే, వాటికి రిస్క్ గురించి కూడా తెలుసు. నా సొంత వ్యాపారం నాశనమైంది. నన్నో విలన్ గా చూడొద్దు" అన్నారు. మొత్తం విషయంలో పెద్ద బాధితుడిని తానేనని, తనకు ఇండియా వెళ్లాలని వున్నా, తన వాదన వినిపించేందుకు పారదర్శకమైన అవకాశం లభించదని భావిస్తున్నానని అన్నారు. తాను ఎక్కడ ఉన్నానన్న విషయాన్ని స్పష్టం చేయలేనని సండే గార్డియన్ కు ఇచ్చిన ఈ-మెయిల్ ఇంటర్వ్యూలో తెలిపారు. యూకేలో సైతం తనను మీడియా వెంటాడుతోందని, తాను మీడియాతో మాట్లాడబోనని తెలిపారు.