: అత్త, ఆడపడుచులు మంచోళ్లే... క్షమాపణలు కోరితే శ్రీకాంత్ తో వెళ్తా: మాట మార్చేసిన మధుప్రియ
తన భర్త వేధిస్తున్నాడని, అతని నుంచి ప్రాణహాని ఉందని నిన్న హుమాయూన్ నగర పోలీసులను ఆశ్రయించిన గాయని మధుప్రియ, ఈ ఉదయం తన ఆలోచనా ధోరణిని కాస్తంత మార్చుకున్నట్టు కనిపించింది. తన అత్తా, ఐదుగురు ఆడపడుచులు మంచివాళ్లేనని వ్యాఖ్యానించిన మధుప్రియ, తన భర్త శ్రీకాంత్ తిరిగి వచ్చి క్షమాపణలు కోరితే తిరిగి వెళ్లేందుకు సిద్ధమని ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. "నువ్వు ఆడపిల్లవమ్మా... కాస్తంత ఓపిక పట్టాలి అని అత్త చెప్పింది. నేనూ ఓపిక పట్టాను. మీకు తెలుసుగా ఆడపిల్లకు భూదేవంత ఓపికుంటుందని. కానీ ఆడపిల్ల ఓపిక నశిస్తే, ఓ శక్తిగా మారుతుంది. ఇప్పుడు నా పరిస్థితీ అంతే, ఆరు నెలల వ్యవధిలో 60 ఏళ్ల అనుభవం వచ్చింది" అని మధుప్రియ తెలిపింది. శ్రీకాంత్ అంటే ఎంతో ప్రేముందని, తన వైఖరిని మార్చుకున్నాడన్న నమ్మకం కలిగితే కాపురానికి వెళ్తానని స్పష్టం చేసింది.