: సాక్షి పేపర్ సహా జగన్ ఆస్తులను స్వాధీనం చేసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం?


ఆదాయానికి మించిన ఆస్తులను సంపాదించారన్న కేసులో వైకాపా అధినేత వైఎస్ జగన్ కోర్టు కేసులను ఎదుర్కొంటుండగా, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసుకున్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తోంది. జగతి పబ్లికేషన్స్, (సాక్షి పత్రిక యాజమాన్య సంస్థ) జననీ ఇన్ ఫ్రాలతో పాటు మరికొన్ని సంస్థలను తమ అధీనంలోకి తీసుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. ఇందుకోసం ఏపీ స్పెషల్ కోర్టుల చట్టం 2015ను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా, కేంద్ర హోం, న్యాయ శాఖలు ఇప్పటికే పచ్చజెండాను ఊపాయి. ఇక రాష్ట్రపతి ఆమోదముద్ర పడితే, ఈ చట్టం అమల్లోకి వస్తుంది. చట్టం అమల్లోకి రాగానే, జగన్ అక్రమాస్తుల కేసు విచారణను ముగించేందుకు కొంత సమయం ఇచ్చి, ఆపై ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచనని యనమల రామకృష్ణుడు వెల్లడించారు. "ఈడీ ఎటాచ్ మెంటులో ఉన్న ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి. ప్రత్యేక కోర్టుల ద్వారా విచారణ వేగవంతం చేసి సత్వర న్యాయానికి కృషి చేస్తాం" అని యనమల వ్యాఖ్యానించారు. కాగా, తన వెనకే వస్తున్న ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన జగన్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లను స్వయంగా కలిసి ఈ విషయమై చర్చించారని సమాచారం. ఏపీ సర్కారు వద్ద ఉన్న వివరాల ప్రకారం, జగన్ యజమానిగా ఉన్న కంపెనీలకు చెందిన సుమారు రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులు ఈడీ అటాచ్మెంటులో ఉన్నాయి. వీటిల్లో ఇండియా సిమెంట్స్, రాంకీ, భారతీ సిమెంట్స్, క్యారమిల్ ఆసియా హోల్డింగ్స్, లేపాక్షీ నాలెడ్జ్ హబ్, ఇందూ ప్రాజెక్ట్స్ తదితర సంస్థలకు చెందిన ఆస్తులున్నాయి.

  • Loading...

More Telugu News