: మాల్యాకు రుణాల వెనుక రాజకీయ నేతల ఒత్తిడి... విచారించనున్న సీబీఐ!
విజయ్ మాల్యాకు రుణాలు ఇవ్వాలని, గతంలో ఇచ్చిన వాటిని పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వ రంగ బ్యాంకులపై రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు వచ్చాయని అనుమానిస్తున్న సీబీఐ, ఈ దిశగా విచారణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విషయంలో కొందరు నేతలు బ్యాంకు అధికారులను ఒత్తిడి చేశారని గతంలోనే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. కొందరు కాంగ్రెస్ మంత్రులు ఆయనకు అండగా నిలిచారని కూడా కథనాలు వెలువడ్డాయి. ఇక వీరి పాత్రపై కూపీ లాగుతున్న సీబీఐ, మాల్యా సంస్థకు రుణాలను మంజూరు చేసిన బ్యాంకు అధికారులను ప్రశ్నించాలని నిర్ణయించింది. ప్రధానంగా ఐడీబీఐ బ్యాంకు పాత రుణాన్ని వసూలు చేసేందుకు ప్రయత్నించకుండా, మరింత లోన్ ఇచ్చిన విషయమై వాస్తవాలను వెలికితీయాలని, అదనపు రుణం ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం వెనకున్న అసలు వ్యక్తిని గుర్తించాలని సీబీఐ భావిస్తోంది. ఉద్యోగులకు వేతనాలు ఇస్తూ, వారి నుంచి టీడీఎస్ కింద వసూలు చేసిన రూ. 111 కోట్లను ఆదాయపు పన్ను శాఖకు కట్టలేనంత ఆర్థిక కష్టాల్లో ఉన్న సంస్థకు ఆడిటర్లుగా వ్యవహరించిన వారిని కూడా ప్రశ్నించాలని సీబీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, తమ ముందు హాజరు కావాలని ఈడీ పంపిన ఈ-మెయిల్ నోటీసులకు మాల్యా ఇంతవరకూ సమాధానం ఇవ్వలేదు.