: అన్నను సీఎంగా చూసుకునేందుకు కదలనున్న పవర్ స్టార్!


మెగాస్టార్ చిరంజీవిని ముఖ్యమంత్రిని చేసేందుకు పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం అధికారికంగా వెల్లడి కానప్పటికీ, ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే, ఏమైనా జరగవచ్చనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం, బీజేపీ పార్టీల మధ్య బంధం రోజురోజుకూ బలహీనపడుతూ, ఏ క్షణాన తెగుతుందో అన్న అనుమానాలు పెరుగుతున్న నేపథ్యంలో చిరంజీవి, ఇప్పటికే బీజేపీతో సన్నిహితంగా ఉన్న పవన్ కల్యాణ్ లు ఆ పార్టీలో చేరనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాను పార్టీని మారబోవడం లేదని ఇటీవల చిరంజీవి చెప్పినప్పటికీ, ఆయన చేరితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనేనని బీజేపీ నేతలు ఇప్పటికే ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఇక అన్నను సీఎంగా చేసేందుకు పవన్ స్వయంగా ప్రచార బాధ్యతలు తలకెత్తుకుంటారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. "బీజేపీతో ఉన్న మా బంధం తెగుతుందా? అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేం. మా నేత చంద్రబాబునాయుడు, ప్రధాని మోదీల మధ్య గతంలో ఉన్నంత దగ్గరి సంబంధాలు ఇప్పుడు లేవు. ఇది మమ్మల్ని ఎక్కడికి తీసుకెళుతుందో" అని ఓ సీనియర్ తెలుగుదేశం నేత వ్యాఖ్యానించారు. "రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ప్రజల నాడి పట్టుకోవడం చాలా కష్టం. ఈ సమయంలో ఎటువంటి అంచనాలూ వేయలేం. అయితే, పవన్ కు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. దాన్ని ఆయన ఓట్ల రూపంలోకి మలచగలరా? అన్నది ఊహాగానమే" అని ఓ కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యానించారు. వాస్తవానికి చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం 2018తో ముగుస్తుంది. ఇక ఆలోగానే ఆయన పార్టీ మారతారా? లేదా ఎన్నికలు జరిగే 2019 వరకూ కాంగ్రెస్ లోనే కొనసాగుతారా? అన్నది ఇప్పటికి సస్పెన్స్.

  • Loading...

More Telugu News