: కేంద్రం మెడలు వంచి అయినా సరే ప్రత్యేక హోదా సాధిస్తాం: రఘువీరా
కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మరీ, ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా విషయమై కోటి సంతకాలు సేకరించిన కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీని కలవనున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్టణం నుంచి ఏపీ ఎక్స్ ప్రెస్ లో ఢిల్లీ బయలుదేరారు. కొద్దిసేపటి క్రితం విజయవాడ చేరుకున్న కాంగ్రెస్ నేతలకు రైల్వేస్టేషన్ లో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో నైనా సరే, ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడమే తన కర్తవ్యమని, దీనికోసం తాము ఎంత కష్టమైనా పడతామని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా చట్టంలో పెట్టాల్సిన అవసరం లేదని, భారతదేశంలో ఇంతవరకు 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారనీ, అవన్నీ కూడా కేవలం కేబినెట్ నిర్ణయాలతోనే ఇవ్వడం జరిగిందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై గతంలో కేబినెట్ నిర్ణయం జరిగిందని.. అందుకని ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలి..ఇచ్చి తీరాల్సిందేనని రఘువీరారెడ్డి ఉద్ఘాటించారు.