: మాల్యా నాకు దొరికేశాడోచ్!... ఫేస్ బుక్ లో ‘అల్లరి’ నరేశ్ కామెంట్స్!
మొత్తం 17 బ్యాంకులు... రూ.7 వేల కోట్లకు పైగా రుణాలిచ్చేశాయి. తీసుకున్న వ్యక్తి రుణాలను చెల్లించడంలో ఆసక్తి చూపలేదు. ఏదో సాధారణ వ్యక్తి అయితే అరిచి గోల పెట్టే బ్యాంకులు... తమ వద్ద వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్న సదరు వ్యక్తి బడా పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా కావడంతో కిమ్మనకుండా ఉండిపోయాయి. ప్రమాదం గమనించి స్పందించేలోగానే ఆయనగారు ఎంచక్కా విదేశాలకు ఎగిరిపోయారు. ఇంకేముంది! ఎలాగోలా ఆయనను దేశానికి రప్పించేందుకు బ్యాంకులన్నీ రంగంలోకి దిగాయి. అయితే ప్రపంచంలో అందరికీ తెలిసిన మాల్యా అడ్రెస్ పోలీసులకు మాత్రం తెలియలేదు. దీంతో మాల్యాకు సంబంధించిన పలు ఆసక్తికర కథనాలు నేషనల్ మీడియాతో పాటు ఆయా ప్రాంతీయ మీడియాల్లోనూ లెక్కలేనన్ని ప్రసారమవుతున్నాయి. ఈ క్రమంలో హ్యూమర్ కే కిర్రెక్కించే మన టాలీవుడ్ కామెడీ హీరో అల్లరి నరేశ్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఓ ఫోటో, దానికి అతడు జోడించిన వ్యాఖ్య ఆసక్తి రేపుతోంది. గతంలో విజయ్ మాల్యాతో కలిసి తాను తీసుకున్న సెల్ఫీ ఫొటోను పోస్ట్ చేసిన అల్లరి నరేశ్... దానికి ‘‘బ్యాంకులకు దొరకని విజయ్ మాల్యా నా సెల్ఫీకి చిక్కాడు’’ అన్న కామెంట్ ను జోడించాడు.