: బుల్లితెర నటికి ఫోన్ లో వేధింపులు... బంజారాహిల్స్ పోలీసులకు చేరిన ఫిర్యాదు
హైదరాబాదులో వేధింపురాయుళ్ల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. సిల్వర్ స్క్రీన్ తో పాటు టీవీ స్క్రీన్ పై తమ పనేదో తాము చేసుకుంటూ వెళుతున్న నటీమణులకు వరుసగా వేధింపులు ఎదురవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఎక్కడో దూరాన ఉంటూనే ఓ ఆకతాయి ఓ బుల్లితెర నటిని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ వేధింపులను కొంతకాలం పాటు పంటి బిగువునే భరించిన సదరు బాధితురాలు వేధింపుల స్థాయి మరింత పెరగడంతో పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకెళితే... టీవీ చానెళ్లలో ప్రసారమవుతున్న పలు తెలుగు టీవీ షోల్లో నటిస్తూ పొట్ట పోసుకుంటున్న ఎస్.భారతి అనే నటీమణికి మూడు నెలలుగా వేధింపులు ఎదురవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఆమె ఫోన్ కు అసభ్యకర మెసేజ్ లు పంపిస్తూ వేధిస్తున్నాడు. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆమె నిందితుడిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫోన్ కు మెసెజ్ లు వస్తున్న నెంబరును తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం వేట ప్రారంభించారు.