: టీఆర్ఎస్ లో చేరగానే... టెన్షన్లన్నీ పోయాయి!: ఎర్రబెల్లి ఆసక్తికర కామెంట్
మొన్నటిదాకా టీ టీడీఎల్పీ నేతగా కీలక పదవిలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటీవలే టీఆర్ఎస్ లో చేరిపోయారు. తాజాగా తమను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలన్న ఎర్రబెల్లి లేఖకు స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించారు. టీ టీడీపీని వీడిన మొత్తం 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ అనుబంధ సభ్యులుగా గుర్తిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా నిన్న అసెంబ్లీలో ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘టీఆర్ఎస్ లో చేరడంతో టెన్షన్లన్నీ పోయాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీలో ఉన్నంత కాలం టెన్షన్ తో బతికా. ఎన్నో సమస్యలు వెంబడించాయి. ఇప్పుడు ఒక్కసారిగా తలపై భారం తీరినట్లుగా ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక ఇక తనకు ఎలాంటి కోరికలు కూడా లేవని ఎర్రబెల్లి అన్నారు. మంత్రి పదవిపై కూడా ఆశ లేదా? అన్న మీడియా ప్రశ్నకు సమాధానమివ్వని ఎర్రబెల్లి ముసిముసిగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.