: కన్నయ్య చర్యలపై గళం విప్పిన జాహ్నవికి బెదిరింపులు
ప్రధాన మంత్రి నరేంద్రమోదీని గురించి ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన లుథియానాకు చెందిన పదిహేనేళ్ల బాలిక జాహ్నవి బెహల్ కు బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై రక్షాజ్యోతి ఫౌండేషన్ ప్రెసిడెంట్ అశ్వని బెహాల్ పంజాబ్ పోలీస్ అధికారికి లేఖ రాశారు. జాహ్నవికి సెక్యురిటీ కల్పించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. సమాజ అభ్యున్నతికి జాహ్నవి నిరంతరం పనిచేస్తోందని అన్నారు. జాహ్నవి సోషల్ మీడియా అకౌంట్ అసభ్య భాషతో, బెదిరింపులతో నిండిపోతోందని ఆమె తండ్రి మీడియాతో చెప్పారు. సోషల్ మీడియా ద్వారా తనను గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నట్లు జాహ్నవి కూడా వెల్లడించింది. అనంతరం కన్నయ్య గురించి మాట్లాడుతూ.. ఎటువంటి ఆధారాలు లేకుండానే కన్నయ్య దేశాన్ని కాపాడుతున్న సైనికులను సైతం విమర్శిస్తున్నారని అన్నారు. దేశ ద్రోహం ఆరోపణల కింద అరెస్టై, అనంతరం బెయిలుపై విడుదలైన కన్నయ్య కుమార్ చర్యలపై జాహ్నవి స్పందిస్తూ.. జేఎన్యూ స్టూడెంట్ లీడర్ది దేశ వ్యతిరేక చర్య అని, ఆయనతో ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమంటూ సవాలు విసిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెకు బెదిరింపులు వస్తున్నాయి.