: సీఎం సాయంతో ఘనంగా ఫణికర మల్లయ్య కూతురు వివాహం
తెలంగాణ వస్తేనే తమ బతుకులు బాగుపడతాయంటూ నాడు చంద్రబాబు నాయుడితో వాదించిన ఫణికర మల్లయ్య రెండో కుమార్తె వివాహం ఈరోజు ఘనంగా జరిగింది. గతంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మల్లయ్య ఇద్దరు కూతుళ్ల వివాహం కోసం రూ.10 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం తరపున వివాహానికి హాజరైన టీఆర్ఎస్ నేతలు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం వధూవరులను ఆశీర్వదించారు. ఇదిలాఉండగా, వరంగల్ జిల్లా టీఆర్ఎస్ ఇన్ ఛార్జ్ పెద్ది సుదర్శన్ కూడా రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ, తన కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటానని అన్నారు. కాగా, నాడు తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా జరుగుతున్న సమయంలో వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబును మల్లయ్య నిలదీశాడు. తెలంగాణపై బాబు వైఖరేమిటో స్పష్టం చేయాలంటూ నాడు ఆయన డిమాండ్ చేశాడు.