: అరటి పండు కోసం తన్నుకున్న తమిళ ఖాకీలు!
రాత్రి వేళ గస్తీ కోసం బయలుదేరిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు పోలీసులు ఓ చిన్న అరటి పండు కోసం వాదులాడుకున్నారు. తన్నుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. రక్తమోడుతున్న స్థితిలో చివరకు ఆసుపత్రి బెడ్లు ఎక్కారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన బుధవారం రాత్రి తమిళనాడులోని శ్రీరంగంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... శ్రీరంగంలో విధులు నిర్వర్తిస్తున్న స్పెషల్ సబ్ ఇన్స్ పెక్టర్ రాధా, జీపు డ్రైవర్ శరవణన్ లు రాత్రి పెట్రోలింగ్ కు బయలుదేరారు. రాత్రి విధులు ముగించుకున్న అనంతరం పొద్దునే తినడానికంటూ శరవణన్ ఓ అరటి పండు కొనుక్కుని జీపులో పెట్టుకున్నాడు. అయితే ఎప్పుడు తినేశాడో కానీ రాధా దానిని తినేశాడు. ఆ తర్వాత తన అరటి పండు కనిపించకపోవడంతో రాధాను శరవణన్ ప్రశ్నించాడు. తానే ఆ అరటి పండును తిన్నానని రాధా చెప్పాడు. అంతే, ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన శరవణన్... రాధాపై తిట్ల దండకం అందుకున్నాడు. రాధా కూడా ఎదురు తిరిగాడు. మాటలు కాస్తా పెనుగులాటకు దారి తీశాయి. పెనుగులాట కాస్తా ముష్టిఘాతాలకు తెర లేపింది. ఘర్షణను చూసి సమీపంలోనే ఉన్న పోలీసులు అక్కడికి పరుగు పరుగున చేరుకునేసరికి ఇద్దరికి ముక్కుల్లో నుంచి రక్తం కారడంతో పాటు కాళ్లు, చేతులకూ గాయాలయ్యాయి. వారిద్దరిని విడిపించిన సహచర పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ శ్రీరంగం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక సమాచారం మేరకు జీపులోకి ఎక్కుతున్న సమయంలోనే ఏదో విషయంపై వాదులాడుకున్న వారిద్దరి మధ్య... ఒకరు కొన్న అరటి పండు మరొకరు తినడం దెబ్బలాటకు దారి తీసిందట.