: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితా ఇది!
వరుసగా మూడవ సంవత్సరంలోనూ ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో సింగపూర్ నిలిచింది. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిటీ (ఈఐయూ) 2016 సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా నివాస సర్వేను నిర్వహించి అత్యంత ఖరీదైన నగరాలకు ర్యాంకులను ఇచ్చింది. ఈ జాబితాలో జూరిచ్, హాంకాంగ్, జనీవా, పారిస్ లు సింగపూర్ తరువాత టాప్-5లో స్థానం సంపాదించుకున్నాయి. లండన్ ఆరవ స్థానంలో, న్యూయార్క్ ఏడవ స్థానంలో నిలిచాయి. ఈ నగరాల్లో ఆహారం నుంచి దుస్తులు, పనివారికి వేతనాలు, రవాణా, వివిధ బిల్లులు సహా 160 రకాల సేవలు, ప్రొడక్టులకు చెల్లించాల్సిన మొత్తం పెరిగిందని ఈఐయూ వెల్లడించింది. ఇక నివాసానికి అతి తక్కువ వ్యయం అయ్యే నగరంగా జాంబియా రాజధాని లుసాకా చోటు దక్కించుకుంది. ఆ తరువాత బెంగళూరు, ముంబై నగరాలు ఉన్నాయి. అమెరికా డాలర్ తో వివిధ దేశాల కరెన్సీ విలువలో తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడుతున్న కారణంగా పలు నగరాల్లో నివాసానికి వెచ్చించాల్సిన మొత్తం గణనీయంగా మారుతోందని ఈఐయూ వెల్లడించింది. ఆస్ట్రేలియా డాలర్ బలహీనంగా ఉన్న కారణంగా మెల్ బోర్న్, సిడ్నీ నగరాలు టాప్ 10 నుంచి వైదొలగాయని తెలిపింది. ఈ తరహా సర్వేను తాము గత 17 సంవత్సరాల నుంచి చేస్తున్నామని, 2015లో నమోదైన ఒడిదుడుకులను ఎన్నడూ చూడలేదని ఈఐయూ సర్వే ఎడిటర్ జాన్ కోపెస్టకే వ్యాఖ్యానించారు.