: టీఆర్ఎస్ లో టీ టీడీపీ ఎమ్మెల్యేల విలీనంపై జానా విస్మయం... స్పీకర్ నిర్ణయం తప్పేనని వ్యాఖ్య
గులాబీ గూటికి చేరిన టీ టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో విలీనం చేస్తూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి తీసుకున్న నిర్ణయంపై సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. నేటి శాసనసభా సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ రాంరెడ్డి వెంకటరెడ్డి మృతికి సంతాపం తెలిపిన వెంటనే సభ రేపటికి వాయిదా పడింది. ఆ తర్వాత స్పీకర్ చాంబర్ లో జరిగిన సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశానికి హాజరైన జానారెడ్డి, సమావేశం ముగిసిన తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. టీడీపీ టికెట్లపై విజయం సాధించి సభలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న 12 మంది సభ్యులను టీఆర్ఎస్ లో ఎలా విలీనం చేస్తారని జానారెడ్డి ప్రశ్నించారు. ‘‘స్పీకర్ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది. స్పీకర్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. చట్టాలు, రాజ్యాంగాన్ని అమలు చేసేవారే వాటిని అతిక్రమిస్తారా? ధర్మాన్ని నిలబెట్టేలా పరిపాలన సాగించాలి’’ అని జానా కుండబద్దలు కొట్టారు.