: మంత్రి పైడికొండల, ఎమ్మెల్యే బోండా మధ్య వాగ్వాదం... దుర్గ గుడి ఈవో వివాదమే నేపథ్యం
ఏపీలో మరో బిగ్ ఫైట్ చోటుచేసుకుంది. అధికార పార్టీ టీడీపీకి చెందిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, తమ మిత్రపక్షం బీజేపీకి చెందిన దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుతో వాగ్వాదానికి దిగారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఈఓ వివాదం నేపథ్యంలోనే వీరి మధ్య నేటి ఉదయం విజయవాడలో మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఉద్యోగులపై వేధింపులకు పాల్పడ్డ ఈఓను తక్షణమే సస్పెండ్ చేయాలని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న బోండా ఉమా డిమాండ్ చేశారు. అయితే ఈ వ్యవహారంపై నియమించిన విచారణ కమిటి నివేదిక సమర్పించిన తర్వాత ఈఓపై చర్యల విషయాన్ని పరిశీలిస్తామని పైడికొండల చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బోండా ఉమా మంత్రితో వాగ్వాదానికి దిగారు. అయితే మంత్రి కూడా ఏమాత్రం తగ్గకుండా అంతే స్థాయిలో ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.