: పోలీసుల చక్రబంధంలో చంద్రబాబు సొంతూరు... ఎమ్మార్పీఎస్ కార్యకర్తలే కారణమట
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు... చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం నారావారిపల్లెలో ఇంకా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఎస్సీ వర్గీకరణను డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ... చంద్రబాబు సొంతూరు నుంచే యాత్ర ప్రారంభిస్తానని ప్రకటించిన నేపథ్యంలో మూడు రోజుల క్రితం నారావారిపల్లె పోలీసుల చక్రబంధంలోకి వెళ్లిపోయింది. మొన్న రాత్రే మంద కృష్ణ అరెస్ట్ కావడం, నిన్నటి యాత్ర కార్యరూపం దాల్చలేదు. దీంతో టెన్షన్ తొలగిపోయిందిలే అనుకుంటున్న తరుణంలో 153 మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోరాదన్న ముందస్తు చర్యల్లో భాగంగా నారావారిపల్లెలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఆ గ్రామం మీదుగా వెళుతున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత గాని వదలడం లేదు. స్వయంగా తిరుపతి అర్బన్ ఎస్పీ రంగంలోకి దిగారు. 8 మంది డీఎస్పీలు 500 మంది పోలీసులతో బందోబస్తు చర్యల్లో పాలుపంచుకుంటున్నారు.