: కన్నయ్య వివాదాలకు కేరాఫ్ అడ్రెస్!... విద్యార్థినిని బెదిరించిన కేసులో జరిమానాకు గురయ్యాడట!
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్న కన్నయ్య కుమార్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్సేనన్న వాదన వినిపిస్తోంది. ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరితీతను నిరసిస్తూ వర్సిటీలో ఇటీవల జరిగిన ర్యాలీలో జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్న కన్నయ్యతో పాటు మరో ఐదుగురిపై దేశ ద్రోహం కేసులు నమోదు చేశారు. ఈ కేసుతో కన్నయ్య పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ క్రమంలో అతడికి సంబంధించిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో గతేడాది జూన్ 10న జరిగిన ఓ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. వర్సిటీలో బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్న కన్నయ్యను ఓ విద్యార్థిని ప్రశ్నించింది. బహిరంగ మూత్ర విసర్జన సరికాదంటూ అతడికి షాకిచ్చిందట. సదరు విద్యార్థిని చెప్పిన మంచి సలహాను పాటించాల్సిన కన్నయ్య... అందుకు విరుద్ధంగా ఆమెపై విరుచుకుపడ్డాడట. ఆ విద్యార్థినిపై తిట్ల దండకం అందుకున్న కన్నయ్య.... ‘‘సైకో మెంటల్.. నీ అంతు చూస్తా’’ అంటూ బెదిరించాడట. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు విద్యార్థిని కన్నయ్యపై వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన వర్సిటీ అధికారులు కన్నయ్య తప్పు చేశాడని నిర్ధారించారు. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని విచారణ కమిటీ సిఫారసు చేసింది. అయితే విషయం పెద్దది కావడంతో పాటు కన్నయ్య భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వీసీ వారించారు. అయితే తప్పు చేసినందుకు గాను అతడికి రూ.3 వేల జరిమానా విధించారు. సదరు జరిమానాను చెల్లించేసిన కన్నయ్య ఆ కేసు నుంచి బయటపడ్డాడట.