: అరసవల్లిలో భక్తులకు నిరాశ... ఆదిత్యుడి పాదాలను తాకని సూర్య కిరణాలు
శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణుడి పాదపద్మాలను సూర్య కిరణాలు ముద్దాడే అరుదైన సన్నివేశాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులకు నేటి ఉదయం నిరాశే ఎదురైంది. నిన్న ఉదయం ఆదిత్యుడి పాదపద్మాలను సూర్యకిరణాలు ముద్దాడాయి. ఏటా మార్చి, అక్టోబర్ లలో మాత్రమే సాక్షాత్కరించే ఈ సన్నివేశాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అయితే నేడు ఆకాశంలో కారు మబ్బులు, పొగ మంచు కారణంగా సూర్య కిరణాలు ఆదిత్యుడి పాదాలను తాకలేకపోయాయి. దీంతో ఎంతో ఆశతో అరసవల్లి వచ్చిన భక్తులు నిరాశగా వెనుదిరిగారు. మళ్లీ అక్టోబర్ లోనే నిన్నటి అరుదైన సన్నివేశం కనిపించనుంది.