: గ్రూప్-2 పరీక్ష యథాతథం... వాయిదా పడలేదు!: టీఎస్పీఎస్సీ చైర్మన్
తెలంగాణలో వచ్చే నెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్న గ్రూపు-2 రాత పరీక్షా వాయిదా పడిందన్న వార్త అబద్ధమని టీఎస్పీఎస్సీ చైర్మన్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. ప్రకటించిన తేదీల్లోనే గ్రూపు-2 రాత పరీక్ష యథాతథంగా జరుగుతుందన్నారు. గ్రూపు-2 రాత పరీక్ష వాయిదాపడిందనే వదంతులను నమ్మవద్దని, అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. గ్రూపు-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, ఇటీవల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను ఆయా శాఖల ఇంజనీర్ ఇన్ చీఫ్ లకు ఈరోజు ఆయన అందజేశారు. మరోవారం రోజుల్లో 1050 ఏఈ పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని, గ్రూపు-2 మినహా తాము నోటిఫికేషన్లు ఇచ్చిన పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని చక్రపాణి పేర్కొన్నారు.