: మహారాష్ట్రే కాదు... యావత్తు దేశమూ ఎవరబ్బ సొత్తూ కాదు: బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్
మహారాష్ట్రే కాదు యావత్తు దేశమూ ఎవరబ్బ సొత్తూ కాదని బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఘాటుగా స్పందించారు. మహారాష్ట్రలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఆటోరిక్షాలకు పర్మిట్ తీసుకుంటే చూస్తూ ఊరుకోవద్దని.. వారి ఆటోలను తగులబెట్టాలని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ఈ దేశం ఎవరి సొత్తూ కాదన్న విషయాన్ని రాజ్ ఠాక్రే తెలుసుకోవాలని అన్నారు. రాజ్ ఠాక్రేపై ప్రధాని మోదీ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా, మహారాష్ట్రలో 70 శాతం ఆటో పర్మిట్ లు మరాఠేతరులకే ఉన్నాయని, ఆ ఆటోలకు నిప్పుపెట్టాలంటూ రాజ్ ఠాక్రే తమ కార్యకర్తలకు పిలుపు నివ్వడంపై పలువురు మండిపడుతున్నారు.