: ఇష్టానుసారంగా కాస్మటిక్స్ వద్దు.. అమ్మాయిలకు పరిశోధకుల సలహా
రెగ్యులర్‌గా చర్మానికి కాస్మటిక్ రాసేస్తున్నారా... మార్కెట్లో కనపడ్డ అన్ని సౌందర్యలేపనాల్నీ ఉపయోగించేస్తున్నారా.. అయితే పరిశోధకులు తెలిపిన కొన్ని చేదు నిజాలను గురించి తెలుసుకోండి. నిత్యం వాడే కాస్మటిక్స్ పై యూసీ బెర్కెలే పరిశోధన సంస్థ చేపట్టిన అధ్యయనంలో అమ్మాయిలకు నచ్చని కొన్ని నిజాలు బయటపడ్డాయి. మార్కెట్లో దొరికే కాస్మటిక్స్ ను ఇష్టానుసారంగా వాడేస్తే ప్రమాదమని అధ్యయనం అనంతరం నిపుణులు హెచ్చరించారు. అమ్మాయిలు నిత్యం రసాయనాలతో కూడిన క్రీములు వాడకుండా ఉంటే ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. తమ చర్మతత్వానికి సరిపోతాయో, లేదో సరిచూసుకొన్న తర్వాతే వాటిని కొనుగోలు చేస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. కాస్మటిక్స్ లో చర్మానికి హానిచేసే పాథలేట్స్, పారాబెన్స్, ట్రిక్లోసన్, ఆక్సీబెంజోన్ అనే రసాయనాలు మోతాదుకు మించి ఉంటాయని చెప్తున్నారు. ఇవి శరీరంలో ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ (ఈడీసీ) విడుదలకు కారణమవుతాయని, తద్వారా రక్తంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఈ 'ఈడీసీ' యువతుల నరాల పనితీరుపై దుష్ప్రభావం, ఊబకాయం, కేన్సర్ కణాల విజృంభణకూ కారణమవుతోందని యూసీ బెర్కెలే పరిశోధన సంస్థ చేపట్టిన అధ్యయనంలో తేలింది కొన్ని రోజులపాటు మార్కెట్లలో విరివిగా దొరికే సౌందర్య సాధనాలను వాడని యుక్త వయసు అమ్మాయిల్లో ఈడీసీ స్థాయులు గణనీయంగా తగ్గినట్లు కూడా పరిశోధనల్లో గుర్తించారు. అందుకే కాస్మటిక్స్ కి అప్పుడప్పుడు దూరంగా ఉండడం వల్ల చర్మానికి, ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వివరించారు. ఇకపై వాటి జోలికి వెళ్లేముందు మీ చర్మానికి ఏ కాస్మటిక్ సరిపోతుందో తెలుసుకొని వాడాలని, అదీ ఎక్కువ కాకుండా ఉపయోగిస్తే మంచిదని పరిశోధకులు చెప్తున్నారు.