: మాల్యాను ఏం చేస్తారో చెప్పాలని పోలీసులను నిలదీసిన పేదరైతు భార్య!


చిన్న మొత్తం చెల్లించనందున తన భర్తను దారుణంగా కొట్టారని, మరి వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన విజయ్ మాల్యాను ఏం చేస్తారో చెప్పాలని తమిళనాడుకు చెందిన పేద రైతు భార్య పోలీసులను ప్రశ్నించారు. వివరాల్లోకి వెళ్తే... తంజావూరుకు చెందిన బాలన్ అనే రైతు పొలం పనుల నిమిత్తం బ్యాంకు నుంచి 3.4 లక్షల రూపాయల లోన్ తీసుకుని ట్రాక్టర్ కొనుగోలు చేశారు. ఇందులో కొంత మొత్తం తిరిగి చెల్లించగా 1.3 లక్షల రూపాయలు ఇంకా బ్యాంకుకు చెల్లించాల్సి ఉంది. అయితే పంట దిగుబడి చేతికి అందకపోవడంతో రెండు నెలలుగా బాలన్ బ్యాంకు వాయిదాలు చెల్లించలేకపోయాడు. దీంతో బ్యాంకు యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు, బాలన్ పై కేసు నమోదు చేసి, ట్రాక్టర్ స్వాధీనం చేసుకుని, అతనిని తీవ్రంగా కొట్టారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై బాలన్ భార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవారమైనందునే తన భర్తను తీవ్రంగా కొట్టారని అన్నారు. వేల కోట్లు దోచుకున్న విజయ్ మాల్యాను వదిలేసిన పోలీసులు తమలాంటి వారిపై ప్రతాపం చూపిస్తున్నారని ఆమె మండిపడ్డారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ, కోర్టు ఆదేశాల మేరకే తాము ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News