: దొంగకు ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి మార్పు తెచ్చాడు!
సాధారణంగా దొంగ దొరికితే ఎవరైనా ఏం చేస్తారు? నాలుగు తగిలిస్తారు...లేదా పోలీసులకు సమాచారమిస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం విభిన్నంగా ఆలోచించి పోయిన వస్తువులు తిరిగి తెప్పించుకున్న ఆసక్తికరమైన సంఘటన కెనడాలో చోటుచేసుకుంది. గిల్మి పట్టణంలో హెచ్.పి.టెర్జిసెన్ అండ్ సన్స్ పేరిట ఓ గిఫ్ట్ షాపు ఉంది. ఈ దుకాణంలో చొరబడిన దొంగ...అందులో విలువైన వాచీలు దోచుకెళ్లిపోయాడు. ఈ షాపులో సీసీ కెమెరాలు ఉన్నాయి. దీంతో ఈ దొంగ వ్యవహారం మొత్తం అందులో రికార్డు అయింది. పుటేజ్ మొత్తాన్ని దుకాణదారు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇది కాస్తా వైరల్ కావడంతో ఒక్క రోజులోనే ఆ దొంగ ఎవరు? అన్న విషయాన్ని నెటిజన్లు గుర్తుపట్టేసి అతని పేరు చెప్పారు. దీంతో ఆ దొంగకు దుకాణదారు ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. ఈ రిక్వెస్ట్ చూసిన దొంగ 'క్షమించండి' అంటూ దొంగిలించిన వస్తువులన్నింటినీ తిరిగి ఇచ్చేశాడు. అంతటితో ఆగకుండా నేరుగా పోలీసులకు లొంగిపోయాడు. నేను అతని షాపులో దొంగతనం చేస్తే...అతను తనను పోలీసులకు పట్టించకుండా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారని, ఆయన చాలా గొప్ప వ్యక్తి అని, అందుకే ఎలాంటి శిక్ష విధించినాసరే అని లొంగిపోయానని అన్నాడు.