: స్మార్ట్ ఫోన్ల కొత్త సిస్టమ్ 'ఆండ్రాయిడ్ ఎన్ బీటా' వచ్చేసింది... ఫీచర్లివే!
స్మార్ట్ ఫోన్ కస్టమర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న 'ఆండ్రాయిడ్ ఎన్ బీటా'ను గూగుల్ ముందుగా అనుకున్న సమయంకన్నా ముందుగానే మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిలో ప్రధాన ఆకర్షణ మల్టీ - విండోస్ సపోర్ట్. ఏవైనా రెండు యాప్ విండోస్ ఒకేసారి ఓపెన్ చేసుకోవచ్చు. దీంతో పాటు సరికొత్త నోటిఫికేషన్ షేడ్ తో పాటు మరింత వేగవంతమైన, మెరుగైన పనితీరును కలిగివుంటుందని, దశలవారీగా దీన్ని మరింతగా అభివృద్ధి చేయనున్నామని గూగుల్ ఆండ్రాయిడ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ డేవ్ బుర్కే వ్యాఖ్యానించారు. ఫోన్ ఐడిల్ లో ఉన్న సమయంలో బ్యాటరీని మరింతగా ఆదా చేసే 'డోజ్', రామ్ వాడకంపై ప్రభావం చూపే యాప్స్ నియంత్రణ, డేటాను ఆదా చేసే సేవర్ మోడ్, నంబర్ లాకింగ్/బ్లాకింగ్ సదుపాయాలుంటాయి. ఇంతకుముందు గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పోలిస్తే, అదనంగా 100 స్థానిక భాషలకు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ డైరెక్ట్ గా బూట్ కావడం ఇందులోని ఇంకో ఆకర్షణీయ ఫీచర్. కస్టమర్ల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా దీనికి మార్పు చేర్పులు చేస్తామని తెలిపారు. కాగా, వాస్తవానికి మే 22 నుంచి ప్రారంభమయ్యే 'గూగుల్ ఐ/ఓ 2016'లో దీన్ని విడుదల చేస్తారని భావించారు. ఈలోగా ఎన్ బీటాను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా ముందే విడుదల చేసినట్టు తెలుస్తోంది. గూగుల్ మార్కెటింగ్ చేసిన నెక్సస్ సిరీస్ ఫోన్లను ఈ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ కు అప్ గ్రేడ్ చేసుకోవచ్చని బుర్కే తెలిపారు. నెక్సస్ 6పీ, నెక్సస్ 5 ఎక్స్, నెక్సస్ 6, జనరల్ మొబైల్ 4జీ ఆండ్రాయిడ్ వన్, నెక్సస్ ప్లేయర్, నెక్సస్ 9, పిక్సెస్ సీ డివైజ్ లను 'ఆండ్రాయిడ్ ఎన్ బీటా'తో అప్ గ్రేడ్ చేసుకోవచ్చని వివరించారు.