: పాపను బ్యాగ్ లో దాచి, విమానంలో తీసుకెళ్తూ దొరికి పోయిన మహిళ
పిల్లకి టికెట్ తీయడం వేస్ట్ అనుకున్న ఓ మహిళ తన నాలుగేళ్ల బాలికను బ్యాగులో పెట్టి విమానంలో తీసుకెళుతూ అడ్డంగా బుక్కయిన ఘటన ఫ్రాన్స్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఫ్రాన్స్ కు చెందిన మహిళ, హైతీ దేశానికి చెందిన నాలుగేళ్ల బాలికను దత్తత తీసుకుంది. ఆ చిన్నారి ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తగా బ్యాగులో పడుకోబెట్టి, టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి పారిస్ కు వెళ్తున్న విమానం ఎక్కింది. పాపను ఉంచిన బ్యాగును విమానంలో తన కాళ్ల దగ్గర పెట్టుకుంది. మార్గమధ్యంలో ఆమె టాయ్ లెట్ కు వెళుతూ, ఆ బ్యాగు తీసుకుని వెళ్లడంతో అనుమానం వచ్చిన తోటి ప్రయాణికులు సిబ్బందికి తెలిపారు. దీంతో, తనిఖీలు చేసిన సిబ్బంది మహిళ బ్యాగులో పాప ఉన్న విషయాన్ని గుర్తించారు. దీనిపై వారు అధికారులకు సమాచారం అందించగా, విమానం దిగగానే అధికారులు మహిళలను అదుపులోకి తీసుకుని, పాపను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు.