: నల్గొండలో మద్యం మత్తులో వున్న రోగితో పోలీసుల 'తన్ను'లాట!


ఓ మందుబాబుపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించిన సంఘటన తాజాగా నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే, నల్గొండలోని ప్రభుత్వాసుపత్రికి వైద్య పరీక్షల కోసం ఓ రోగి ఎక్కువగా వస్తుంటాడు. అయితే, ఈ రోజు అతను మద్యం తీసుకుని క్యూలైన్ లో నిల్చున్నాడు. అతని నుంచి మద్యం వాసన రావడంతో ఆ లైన్లలో నిల్చున్న ఇతర రోగులు సెక్యూరిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో వారు అతనిని ఆసుపత్రి బయటకు ఈడ్చేశారు. అనంతరం అక్కడికి వచ్చిన పోలీసులు, మద్యం మత్తులో పడిపోయి ఉన్న ఆ వ్యక్తిని కాలితో తన్నారు. తాను ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చానని మొత్తుకున్నా వినకుండా అతనిని కాలితో పదేపదే తన్నడం కనిపించింది. ఇది ఇప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని మానవత్వం మరచి, బాధ్యతాయుతమైన పోలీసులు తన్నడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News