: ఐఎస్ లో చేరాలంటే... ‘బర్త్ డే’తో పాటు ‘డెత్ డే’ను కూడా ముందే చెప్పాలట!
ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా బరిలోకి దిగి ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్న ఉగ్రవాద సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)’... జన బలం కోసం ఎవరు పడితే వారిని చేర్చుకుంటుందంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఆ సంస్థలో చేరి జిహాదీగా మారాలంటే... అత్యంత కఠినమైన పరీక్షలో పాస్ కావాల్సిందేనట. ఈ మేరకు ‘స్కై న్యూస్’ సంస్థ తాజాగా సేకరించిన ఆధారాలు ఆసక్తిగొలిపే విషయాలను వెల్లడిస్తున్నాయి. ‘ఎంట్రెన్స్ ఇంటర్వ్యూ’ పేరిట ఐఎస్ ఉగ్రవాదులు పెట్టే కఠిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే ఆ సంస్థలో సభ్యులుగా మారగలరు. ఈ కఠిన పరీక్ష... శారీరక దారుఢ్యాన్ని పరీక్షించేందుకు కాదట. కేలవం సదరు వ్యక్తి మైండ్ సెట్ ను అంచనా వేసేందుకేనట. ఈ పరీక్షలో మొత్తం 23 ప్రశ్నలను ఐఎస్ ఉగ్రవాదులు తమ వద్దకు వచ్చే యువకులకు సంధిస్తున్నారు. ఈ ప్రశ్నల్లో సదరు వ్యక్తి కుటుంబ నేపథ్యం, జాతీయత, బ్లడ్ గ్రూపు, డేట్ ఆఫ్ బర్త్ తో పాటు ‘డేట్ ఆఫ్ డెత్’ను తెలపాల్సిన ప్రశ్నలు ఉన్నాయి. వీటిలో పుట్టిన తేదీ, ప్రదేశం నుంచి చనిపోయేందుకు సిద్ధపడే ప్రాంతం, తేదీని కూడా తెలపాలన్న ప్రశ్నలు కూడా ఉండటం గమనార్హం. ఈ ప్రశ్నలు కింది విధంగా ఉన్నాయి. 1. పేరు 2. తండ్రి పేరు 3. తల్లి ఇంటి పేరు 4. బ్లడ్ గ్రూపు 5. పుట్టిన తేది, జాతీయత 6. వివాహ స్థితి 7. చిరునామా, నివాస స్థలం 8. విద్యార్హత 9. షరియాను అర్థం చేసుకునే స్థాయి 10. గత ఉద్యోగం 11. పర్యటించిన దేశాల వివరాలు 12. ఏ ప్రదేశం నుంచి ప్రవేశించారు? 13. సిఫారసు చేసిన వ్యక్తి ఎవరు? 14. ఎంట్రీ ఇచ్చిన తేదీ 15. గతంలో పోరాటం సాగించారా? 16. అయితే, ఏ పాత్ర పోషించారు? 17. నైపణ్యం వివరాలు 18. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రదేశం 19. సెక్యూరిటీ డిపాజిట్ 20. విధేయత స్థాయి 21. సంప్రదించాల్సిన నెంబర్లు 22. మరణానికి సిద్ధపడే ప్రాంతం, తేదీ 23. ఇతర వివరాలు