: అమెరికా చరిత్రలో సుదీర్ఘ కాల బందీ, పాకిస్థాన్, ఇరాన్, ఆఫ్గన్... ఈ గూఢచారిని ఎక్కడ దాచారో!
అతని పేరు రాబర్ట్ లెవిన్సన్... అమెరికా ఎఫ్బీఐ తరఫున గూఢచారిగా పనిచేస్తూ, ఇరాన్ ద్వీపం కిష్ లో అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి ఆయన ఎక్కడున్నాడో తెలియదు. బతికే ఉన్నాడనడానికి ఆధారాలు మాత్రం తరచూ ప్రత్యక్షమవుతున్నాయి. ఒకవేళ లెవిన్సన్ బతికి ఉంటే, ఇరాన్ లోనే ఎక్కడో బందీగా ఉండవచ్చని ఎఫ్బీఐ ఏజంట్లు అనుమానిస్తుండగా, ప్రభుత్వం మాత్రం ఆయన మరేదో దేశంలో ఉండవచ్చని భావిస్తోంది. దాదాపు 9 సంవత్సరాల క్రితం కిష్ లో లెవిన్సన్ ను అపహరించుకుపోయారు. ఆపై కొన్ని ఫోటోలు విడుదలయ్యాయి. తరువాత ఓ రెండేళ్లకు 2010లో పాకిస్థాన్ నుంచి ఓ వీడియో ఆయన ఇంటికి వచ్చింది. తరువాత ఆరంజ్ కలర్ జంప్ సూట్ (ఉగ్రవాద కోర్టుల్లో మరణశిక్ష విధించబడ్డ వారికి వేసే దుస్తులు) ధరించిన లెవిన్సన్ ఫోటోలు ఆఫ్గనిస్థాన్ నుంచి విడుదలయ్యాయి. ప్రస్తుతం బందీలుగా ఉన్న వాషింగ్టన్ పోస్ట్ విలేకరి జాసన్ రెజియాన్, లెవిన్సన్ సహా మరో నలుగురిని విడిపించే దిశగా యూఎస్ ప్రభుత్వం ఇరాన్ తో చర్చలు జరిపిన వేళ వీరి విడుదలపై ఆశలు పెరిగాయి. అయితే, ఈ చర్చల అనంతరం లెవిన్సన్ ఇరాన్ దేశంలో లేడని వైట్ హౌస్ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ అధికారులు సైతం ఈ బందీ ఎక్కడున్నాడో తమకూ తెలియదని వెల్లడించింది. నేటితో 68 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న లెవిన్సన్ జాడ తెలిపిన వారికి 5 మిలియన్ డాలర్లు బహుమతి ఇస్తామని ఎఫ్బీఐ ఇప్పటికే ప్రకటించింది. ఆయన ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని విడిపించేందుకు చర్యలు చేపట్టడంలో అలసత్వాన్ని చూపబోమని జాన్ కెర్రీ వ్యాఖ్యానించారు. కాగా, విడుదలైన లెవిన్సన్ ఫోటోల్లో "అమెరికాకు 30 సంవత్సరాలు సేవ చేసినందుకు దక్కిన ఫలితం", "నేనిక్కడ గ్వాంటనామాలో ఉన్నా. ఇదెక్కడుందో మీకు తెలుసా?" వంటి ప్లకార్డులులతో బాటు, చేతులు, మెడకు గొలుసులతో కట్టేసిన స్థితిలో గడ్డం పెరిగిపోయి, దీనంగా చూస్తున్నట్టు ఉన్నాడు.