: 70 వేల ఆటోలను తగలబెట్టేస్తాం: రాజ్ ఠాక్రే హెచ్చరిక
ఆ 70 వేల ఆటోలు రోడ్లపైకి వస్తే తగులబెట్టేస్తామని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే హెచ్చరించారు. పార్టీ పదో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముంబైలో కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఆటోల పర్మిట్లు రాష్ట్రేతరులకే ఎక్కువ వస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ముంబై మహానగరంలో పరుగులు తీస్తున్న ఆటోల్లో 70 శాతం రాష్ట్రేతరులవేనని ఆయన మండిపడ్డారు. ఇకపై కొత్త పర్మిట్ లు తీసుకున్న ఆటోలు కనపడితే వాటిల్లోని ప్రయాణికులను దించేసి అక్కడే దానిని తగులబెడతామని ఆయన చెప్పారు. త్వరలో మరో 70 వేల ఆటోలను నడుపుకునేందుకు రాష్ట్రేతరులకు అనుమతులు ఇవ్వనున్నారన్న సమాచారం తమకు ఉందని, ఆ ఆటోలు రోడ్డు మీదికి వస్తే తగులబెడతామని ఆయన హెచ్చరించారు. మహారాష్ట్ర రవాణా శాఖను చూసుకుంటున్న శివసేన ఈ విషయంలో ఏం చేస్తోందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.