: బాబు వచ్చాడు... జాబు మాత్రం రాలేదు: జగన్ వాకౌట్
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేటి ఉదయం ప్రారంభమైన సమావేశంలో విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సమావేశాల ప్రారంభానికి ముందే ప్రభుత్వంపై అసెంబ్లీ కార్యదర్శికి అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేసి సభలోకి వచ్చిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నోత్తరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీని ప్రస్తావించిన జగన్... ‘బాబు వచ్చాడు... కానీ జాబు రాలేదు’’ అని వ్యాఖ్యానించారు. ఉద్యోగం ఇవ్వలేకున్నా, ఉపాధి చూపలేకున్నా నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పారన్న జగన్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నామని ప్రకటించిన జగన్, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సభ బయటకు వెళ్లిపోయారు.