: ముద్రగడ టెన్షన్ మళ్లీ షురూ!... రేపటి దీక్షపై నేడు కాపు నేత కీలక సమావేశం
కాపులకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టిన కాపు ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోమారు టెన్షన్ వాతావరణానికి తెర తీయనున్నారు. గత నెలలో తాను చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించిన ముద్రగడ... ఈ నెల 10 వరకు ఏపీ ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు. ఆలోగా ఇచ్చిన హామీలు నెరవేర్చని పక్షంలో మరోమారు తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగక తప్పదని కూడా ఆయన హెచ్చరించారు. ప్రభుత్వానికి ముద్రగడ విధించిన డెడ్ లైన్ నేటితో ముగియనుంది. ఈ క్రమంలో ఆయన నేడు కాపు సంఘాలకు చెందిన నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని తన సొంతూరు కిర్లంపూడిలో జరగనున్న ఈ సమావేశానికి కాపు ముఖ్యులంతా హాజరుకానున్నట్లు సమాచారం. మరోవైపు గతానుభవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేలా ప్రభుత్వం పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో నేటి ముద్రగడ భేటీపై ప్రభుత్వం దృష్టి సారించింది. సమావేశానికి ఎవరెవరు హాజరవుతున్నారు, సమావేశంలో ఏఏ అంశాలు ప్రస్తావనకు రానున్నాయి?... తదితర అంశాలపై ప్రభుత్వం ముందుగానే సమాచారం సేకరించేందుకు నిఘా వర్గాలను రంగంలోకి దించింది.