: ఏపీ బడ్జెట్ సిద్ధం!... రూ.1.31 లక్షల కోట్లతో నేడు సభ ముందుకు!
2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీ బడ్జెట్ కు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తుది మెరుగులు దిద్దారు. ఓ వైపు ఆర్థిక లోటు ఉన్నా, బడ్జెట్ లో భారీతనం కొట్టొచ్చినట్లు కనబడేలా ఆయన కసరత్తు చేశారు. తుది మెరుగులు దిద్దిన బడ్జెట్ ప్రతులతో ఆయన నేడు అసెంబ్లీకి రానున్నారు. విశ్వసయనీయ వర్గాల సమాచారం మేరకు... ఈ ఏడాది బడ్జెట్ ను యనమల రూ.1.31 లక్షల కోట్లతో రూపొందించారు. బడ్జెట్ లో నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి, సాగు నీటి ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేశారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకు కూడా ప్రత్యేక సబ్ ప్లాన్ ను ప్రకటించనున్న యనమల... దానికి ఈ ఏడాది రూ.8 వేల కోట్లను ప్రకటించనున్నారు. ఇక కాపుల ప్రధాన డిమాండ్ అయిన కాపు కార్పొరేషన్ కు ఈ ఏడాది రూ.1,000 కోట్లు మంజూరు కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు యనమల బడ్జెట్ ను సభలో ప్రవేశపెడతారు.