: వారం క్రితమే లండన్ చెక్కేసిన మాల్యా!... సుప్రీంకు తెలిపిన కేంద్రం!


లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బ్యాంకులకే కాదండోయ్, కేంద్ర ప్రభుత్వానికి కూడా షాకిచ్చారు. ఓ వైపు మాల్యాకు ఇచ్చిన అప్పులను వసూలు చేసుకునేందుకు బ్యాంకులన్నీ కలిసి కోర్టుల బాట పడితే, అప్పటికే మాల్యా తాననుకున్నట్టుగానే విదేశాలకు చెక్కేశారు. భారత్ లో విమానం ఎక్కిన ఆయన నేరుగా లండన్ లో వాలిపోయారు. ఈ మేరకు నిన్న సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కేంద్రం ఈ విషయాన్ని ఒప్పేసుకుంది. డియాజియో నుంచి రూ.515 కోట్ల గుడ్ విల్ తీసుకున్న తర్వాత లండన్ వెళ్లిపోతానంటూ మాల్యా నుంచి ప్రకటన రావడంతోనే ఒక్కసారిగా బ్యాంకులన్నీ అప్రమత్తం అయ్యాయి. మాల్యాను దేశం విడిచివెళ్లకుండా కట్టడి చేసేందుకు రంగంలోకి దిగాయి. బ్యాంకులు ఆ పనిలో ఉండగానే, మాల్యా నింపాదిగా లండన్ కు చెక్కేశారు. అది కూడా బ్యాంకులు ఇంకా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగకముందే మాల్యా విదేశాలకు పరారయ్యారని కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు వెల్లడించారు. ఈ నెల 2న మాల్యా విదేశాలకు వెళ్లిపోయినట్లు సీబీఐ అధికారులు గుర్తించారని ఆయన కోర్టుకు చెప్పారు. మాల్యాను నిలువరించే విషయంలో సీబీఐ లుకౌట్ నోటీసులు కూడా పనిచేయలేదని ఈ ఘటనతో తేలిపోయింది.

  • Loading...

More Telugu News