: ఏపీ హోం మంత్రితో టీడీపీ కాపు నాయకుల భేటీ
హైదరాబాద్ లోని ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప నివాసంలో టీడీపీ కాపు నాయకులు భేటీ అయ్యారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి నారాయణతో పాటు ఇతర కాపు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం దీక్ష, కాపులకు ప్రభుత్వ పరంగా చేకూర్చాల్సిన ప్రయోజనాలు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా చిన రాజప్ప మాట్లాడుతూ, వైఎస్ హయాంలో కొన్ని కులాలను బీసీల్లో చేర్చారని, కానీ, కాపులు సహా నాలుగు కులాలను అందులో చేర్చకుండా వదిలేశారని అన్నారు. ముద్రగడ రెండుసార్లు ఎంపీగా పనిచేసిన సమయంలో.. కాపులను బీసీల్లో చేర్చాలన్న విషయం మర్చిపోయారా? అని ఆయన ప్రశ్నించారు. ‘గవర్నర్ ప్రసంగంలోనూ కాపులను బీసీల్లో చేర్చే అంశం చెప్పారు.. అసెంబ్లీలో చెప్పినా సరిపోదా.. లేఖ కావాలంటే ఎలా? ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి, ముద్రగడ దీక్ష వెనుక కుట్ర ఉంది’ అని చినరాజప్ప ఆరోపించారు.