: తాను మరణిస్తూ ఎనిమిది మందికి ప్రాణం పోసిన బెంగళూరు యువకుడు... అమెరికాలో భారత విద్యార్థి అవయవదానం!
బ్రెయిన్ డెడ్ అయిన ఓ బెంగళూరు విద్యార్థి అవయవాలను అతని కుటుంబ సభ్యులు పెద్దమనుసుతో దానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఆ విధంగా ఆ విద్యార్ధి తాను మరణిస్తూ 8 మంది జీవితాల్లో వెలుగులు నింపాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోవడం విశేషం. సౌత్ ఈస్ట్ బెంగళూరులోని బొమ్మసండ్ర విద్యానగర్ కు చెందిన రాజీవ్ నాయుడు(24) పీఈఎస్ ఐటీ యూనివర్సిటీ నుంచి 2014లో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో బీఈ పూర్తి చేశాడు. తరువాత న్యూయార్క్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ కొనసాగిస్తున్నాడు. లంగ్ ఇన్ఫెక్షన్‌తో బాధపడడంతో ఫిబ్రవరి 21న రాజీవ్ ను అతని స్నేహితులు ఆసుపత్రిలో చేర్చారు. తరువాత పరిస్థితి విషమించడంతో 'బ్రెయిన్ డెడ్'గా అతనిని వైద్యులు నిర్ధారించడంతో రాజీవ్ తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు. "రాజీవ్ ప్రతిభావంతుడైన విద్యార్థి. వాడిని చూసి మేమెంతో గర్వపడేవాళ్లం. ఇప్పుడు తాను మరణిస్తూ, మరికొంత మందికి ప్రాణం పోసినందుకు నా తమ్ముణ్ని చూసి మరింత గర్వపడుతున్నా"మని రాజీవ్ సోదరి కృతికా పురుషోత్తం చెప్పారు.