: నష్టాల నుంచి లాభాల్లోకి జంప్ చేసిన మార్కెట్ బుల్!
2016-17 వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మరుసటి రోజు నుంచి నమోదవుతున్న మార్కెట్ లాభాలు ఈ రోజు కూడా కొనసాగాయి. సెషన్ ఆరంభంలోని నష్టాలు మధ్యాహ్నం తరువాత లాభాలుగా మారాయి. యూరప్ మార్కెట్ల సరళి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను ఈక్విటీల కొనుగోలు వైపు మళ్లించిందని నిపుణులు వ్యాఖ్యానించారు. బుధవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 134.73 పాయింట్లు పెరిగి 0.55 శాతం లాభంతో 24,793.96 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 46.50 పాయింట్లు పెరిగి 0.62 శాతం లాభంతో 7,531.80 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.94 శాతం, స్మాల్ క్యాప్ 0.04 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 33 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. యస్ బ్యాంక్, మారుతి సుజుకి, టెక్ మహీంద్రా, గ్రాసిమ్, లార్సెన్ అండ్ టూబ్రో తదితర కంపెనీలు లాభపడగా, వీఈడీఎల్, బీపీసీఎల్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ, అదానీ పోర్ట్స్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,627 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,305 కంపెనీలు లాభాల్లోను, 1,192 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. బుధవారం నాటి సెషన్ ముగిసే సరికి బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 92,04,800 కోట్లకు పెరిగింది.